Wednesday, 4 January 2017

భారత దేశపు ఔన్నత్యం

భారత దేశపు ఔన్నత్యం
భారతావని సాంగత్యం
దేశ దేశముల వ్యాపించే
మన భారతావని కీర్తిని పెంచిన || భారత దేశపు||


గల గల పారే నదులెన్నో
మన కళ కళ లాడే వనాలు ఎన్నో
పచ్చ పచ్చని పైరు పంటలతో
విలసిల్లెను మన భారత జనని || భారత దేశపు||


ఆకాశాన తారలు ఎన్నో
ధరణి మండలికి మార్గము నొసగె
 భిన్నత్వం లో ఏకత్వం గా
ఐకమత్యతను బోధించీ
ప్రపంచానికి ఆదర్శమయ్యిన  || భారత దేశపు||



రెప్ప చాటున

రెప్ప చాటున దాగివుండే కమ్మని నిదుర వచ్చిపో 
ఆకాశాన తారాలోకం సేదతీరగ వచ్చిపో


అమ్మ పాడే  పాట ,
నాన్న ఆడే ఏనుగాట
అన్న ఆడే దోబూచాట
తలపున తలచి నిదుర పో
తలగడ చేసి వదిగి పో || రెప్ప చాటున||

గతము చేసిన గురుతులన్నీ
ఉనికిలేని శిలలనీ 
తీరము దాటిన అలలనీ 
కలల కలలో చేరనీ   || రెప్ప చాటున||

Tuesday, 20 December 2016

బజ్జోరా తల్లి , బజ్జోవే తండ్రి


బజ్జోరా  తల్లి , బజ్జోవే తండ్రి
నే చెప్పే కధల అలల కలల తేలాడి
బజ్జోవే తల్లి , బజ్జోవే తండ్రి
నే చెప్పే కధల అలల కలల తేలాడి || బజ్జో ||

అనగనగా ఒక వూరిలో కలువల రేడు
అత్రి అనసూయల గారాల బిడ్డడు
పదహారు వన్నెల వెన్నెల కాడు
రోజు మీతో ఆడే అందాల చంద్రుడు
ఇంటికెళ్ళాలి బువ్వలు తినాలి
మళ్లీ రేపటికొచ్చి మీతో ఆడాలి    .. కాబట్టి || బజ్జో ||


జాజి సంపెంగిలేమో విరబూసే లే
చంగల్వ కాంతులతో రేయి ముస్తాబయ్యాలే
గోవులు గువ్వలు కూడా గూడు చేరెనే
పడమటి దుప్పటి గప్పి సంధ్య నిదురపోయెనే .. కాబట్టి
నిదురపోవాలి నిదురపోవాలి
మళ్లీ ప్రొద్దున లేచి ఆడుకోవాలి   .. కాబట్టి || బజ్జో ||

Sunday, 4 December 2016

గోదారి ఝురి

ఉరకల పరుగుల తలపుల తరగలపొంగులేరు నది గోదారి
తడి పొడి నడకల , జిలిబిలి సొబగుల
ఇలను పొంగేనీ అలివేణి
కొనసీమకే రాజసంగా
నిలిచేనేమో మరి ఈ ఝురి
హరుని గంగై , భువినే చేరే
పరమాత్ముని అవతారమై ॥ ఉరకల ॥

భద్రాద్రి రాముడైనా , లక్ష్మి నరసింహుడైనా
ముక్తేశ్వరుడు ,సోమేశ్వరుడు
నీ సన్నిధినే చేరేరమ్మ
నీ పద శరణం , ముక్తి కి మార్గం
మానవాళి కల్యాణమమ్మ ॥ ఉరకల ॥
కవి సార్వభౌముడైనా , వీరేశలింగమైనా
ఎదరెందరో మహాను భావులు
నీ దరినే పెరిగారమ్మ
నీ జల పానం ,హిత గుణ ప్రదానం
మానవాళి కల్యాణమమ్మ ॥ ఉరకల ॥
కోటిలింగలైనా , వృద్ధ గౌతమైనా
అంతర్వేది, పట్టిసీమలు
నీ సిగానే నిలిచాయమ్మ
నీవు చేసే జలాభిషేకం
మానవాళి కల్యాణమమ్మ ॥ ఉరకల ॥

Sunday, 16 June 2013

నాన్న , అమ్మ

రోజులు గడుస్తున్నాయి , కొత్త తరాలు వస్తున్నాయి




దశలు తిరుగుతున్నాయి , దిశలు మారుతున్నాయి



కాని నాన్న , అమ్మ అనే ఆ పదాలు



కొత్తగా రోజు పుడుతూనే వున్నాయి



నాన్న మందలించినా , అమ్మ బుజ్జగించినా



నాన్న జోలపుచ్చినా , అమ్మ లాలి పాడినా



నాన్న పదిపైసలు ఇచ్చినా , అమ్మ జంతిక పెట్టినా



అనురాగము , ఆప్యాతే తప్ప ఇంకేమీ కనిపించదు .



నానకి , అమ్మకి స్వార్ధము వుండదు



పిల్లలు బాగుండాలని తప్ప



నాన్నకి , అమ్మకి పిల్లలు ఎప్పుడూ పిల్లలే



వారి పొదరింటి గువ్వలే



డభై వచ్చినా , కంటికి జోడు వచ్చినా



కీళ్ళు వినకున్నా , చేతులు అరిగినా



పిల్లలకి ఆవకాయ పంపించాల్సిందే



పెసర పొడి తినిపించాల్సిందే







పిల్లల కష్టం తల్లి తండ్రులదే



పిల్లల ఇష్టం తల్లి తండ్రులదే



తల్లి తండ్రుల ప్రేమకు బేరీజులు వెయ్యలేము



తులాభారం ఇయ్యాలేము



వారి ప్రేమకు మనం ధర కట్టలేము



వారి ఆప్యాతను ఒడిసి పట్టలేము



వారులేకుంటే మనకి ఉనికి లేదు



ప్రేమ గని గురించి కూడా తెలియదు



ఎన్ని మాటలు చెప్పినా



అమ్మ , నాన్న , వారే మన ,బలం బలగం.



అమ్మని , నాన్నని ప్రేమించండి



వారికి కూడా ప్రేమని పంచండి

Sunday, 29 July 2012

రాగాల పల్లకీలో

రాగాల పల్లకీలో సప్త స్వరాలు దాటి..
సంగీత సాగరం లో స్వరమవ్వాలని
పదంమవ్వాలనీ కోరిక..  ||రాగాల ||

సుమధురం , మృదులం నవనీతం
పంచమ శ్రుతి లో కోకిల గానం
ఆ గానానికి గళమవ్వాలని
ప్రకృతి లో వసంతమవ్వాలని మది కోరిక  ||రాగాల||


పయనించే జీవితం లో
ఎన్నో ఆరోహణలు అవరోహణలు
రాగం తానం శ్రుతి లయ మిళితం
జీవన రాగం కావాలని మది కోరిక ||రాగాల ||

Saturday, 28 July 2012

మనసు పాడే మౌన గీతం .. చైత్ర వానలా

నిన్ను చూసాక నేడు , ఏమైయందో తెలియదు నాకు


కలల వొడి లో నేను కవిని అయ్యాను చూడు

నీ మాయలోనే ధ్యానము...

మనసు పాడే మౌన గీతం .. చైత్ర వానలా



నీ నవ్వు చూసి అ కలువ చిన్నపోయిందిలే

నీ మాట విన్న ఆ చిలుక మూగ బోయింది లే

కలువల రేడు నిన్ను చూసి , మబ్బుల చాటున దాగే లే..

నిజమైన కలయే నీవనీ.

మనసు పాడే మౌన గీతం .. చైత్ర వానలా ||నిన్ను ||





నీ మదిని చేరు కో లేక , మది పడే తిక మక..

చాలించి నీ ఈ కినుక మన్నించు నన్నిక

జాలువారిన ఈ భావావేశం నీ తలపులను తాకలనీ

కలనైన నిన్ను చేరాలనీ

మనసు పాడే మౌన గీతం .. చైత్ర వానలా  ||నిన్ను||